మోసపోయిన రైతులకు ధాన్యం సొమ్ము ఇప్పించాలి….
ఏలూరు: దళారుల
చేతిలో మోసపోయిన రైతులకు ధాన్యం సొమ్ము చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల
సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
పి.జమలయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్
చేశారు. బుధవారం ఆంధ్ర ప్రదేశ్
కౌలు రైతుల సంఘం, ఆంధ్ర ప్రదేశ్ రైతు
సంఘాల అధ్వర్యంలో ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద దళారుల చేతిలో మోసపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని కోరుతూ రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్నా నుద్దేశించి పి జమలయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 2023 డిసెంబర్ నుండి 2024 జనవరి ఫిబ్రవరి వరకు రైతులు
పండించిన ధాన్యాన్ని సకాలంలో
కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యంగా
వ్యవహరించడంతో రైతులు దళారులకు
పంట అమ్మి మోసపోయారని తెలిపారు. నూజివీడు మండలంలోని సుంకొల్లు, పడమట దిగవల్లి, అన్నవరం, సూరేపల్లి, ముక్కొల్లు పాడు, చాట్రాయి గ్రామాలకు చెందిన రైతులు 116 మంది
అన్నవరం గ్రామానికి చెందిన మల్లూరు
వెంకట నాగచంద్రశేఖర్, అతని సోదరుడు
సురేష్ కు ధాన్యం విక్రయించి రైతులు మోసపోయారని తెలిపారు.ఈ విషయంపై
మే 25న నూజివీడు రూరల్ పోలీస్
స్టేషన్లో 65 మంది రైతులు ఫిర్యాదు
చేయగా, కేసు నమోదు చేయకుండా
నిర్లక్ష్యంగా వ్యవహరించారని
విమర్శించారు. మంగళవారం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి వినతిపత్రం అందజేసిన తరువాత స్థానిక శాసనసభ్యులు, గృహ నిర్మాణ శాఖామంత్రి కొలుసు పార్థసారధికి రైతులు సమస్య పరిష్కారం చేయాలని కోరుతూ విజ్ఞాపన పత్రం అందజేసే సందర్భంలో అక్కడ ఉన్న పోలీసులు ఈ సమస్యను పరిష్కారం చేయలేమని మంత్రిని
పక్కదారి పట్టించే వ్యవహార శైలి అవలంబించడం దుర్మార్గం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సమస్యను అర్థం చేసుకొని సకాలంలో పరిష్కరించాలని ఆలోచన కూడా మంత్రి వద్ద లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు చేసి పరారైన దళారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దళారులు ఐటిపిటిషన్ దాఖలు చేశారని పోలీసులు తెలుపుతున్నారని, కానీ ఐపీ పిటిషన్ దాఖలకు ముందే ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయలేదని, సంబంధిత ఉన్నతాధికారులు కేసు నమోదు చేయని పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణం జిల్లా ప్రభుత్వ యంత్రాంగం జోక్యం చేసుకొని మోసపోయిన రైతులకు దాన్యం డబ్బులు చెల్లించే విధంగా చదివించే పట్టాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి డేగా ప్రభాకర్ మాట్లాడుతూ నూజివీడు నియోజకవర్గంలో ధాన్యం వ్యాపారం పేరుతో రైతులను మోసం చేసిన దళారులను మంత్రి, పోలీసులు రక్షించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. 116 మంది రైతుల వద్ద సుమారు కోటి రూపాయలు విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేసి మోసం చేసి పరారైన దళారులపై కేసు నమోదు చేయడానికి స్టేషన్కు వెళితే కేసు నమోదు చేయకపోగా రైతాంగాన్ని అవహేళనగా మాట్లాడటం హేయమైన చర్య అన్నారు. దళారులకు ఐపి పిటిషన్ దాఖలు చేయడానికి సమాచారం సమయం ఇచ్చారని, వారికి కొమ్ము కాసే ప్రయత్నం చేశారని, రైతుల పక్షాన నిజాయితీగా పని చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు అన్యాయం చేసిన సురేష్, చంద్రశేఖర్ ఎంత నేరస్తులో వారికి అడుగులకు మడుగులు వస్తే పోలీసులు కూడా అంతే నేరస్తులని ఆరోపించారు. ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకొని రైతులకు ధాన్యం డబ్బులు చెల్లించే ఏర్పాటు చేయాలని కోరారు. దీంతోపాటుగా కేసు నమోదు చేయడానికి వెళ్ళిన సందర్భంలో అవహేళన చేసిన పోలీసులుపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతుల పక్షాన ఈ ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రైతు సంఘం జిల్లా నాయకులు, సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలు, వర్షాభావ పరిస్థితులతో పంటలు నష్టపోవడం ఒక భాగం అయితే, ఆరుగాలం పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో రైతులు దళారుల చేతిలో మోసపోవలసిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసులు నమోదు చేయకుండా ప్రజా ప్రతినిధులు, పోలీసులు చోద్యం చూస్తున్నారని ఆరోపించారు. దళారులను కేసు నుండి తప్పించే విధంగా పోలీసు యంత్రాంగం వ్యవహరిస్తుందని విమర్శించారు. ధాన్యం అమ్ముకొని నష్టపోయిన రైతులందరూ పేద రైతులని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై నష్టపోయిన రైతులకు న్యాయం జరిగే వరకూ ఉద్యమం కొనసాగిస్తామని హెచ్చరించారు.ప్రభుత్వ యంత్రాంగం జోక్యం చేసుకొని దళారుల నుంచి ధాన్యం డబ్బులు రికవరీ చేసి రైతులకు ఇప్పించే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దళారీ వ్యవస్థను నిర్మూలించడానికి ప్రభుత్వం నిబంధనల రూపొందించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్.పి. లకు వినతి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు, రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి రాయంకుల లక్ష్మణరావు , పలువురు రైతు పోరాట కమిటీ గంగుల గిరీష్ బాబు, కన్వీనర్ కస్తూరి శ్రీనివాసరావు, పెద్దలంక వీర వెంకయ్య, కంచర్ల నాగరాజు, మందపాటి రంగారావు, కలవల వెంకటేశ్వరరావు, నల్లి బోయిన నాగరాజు, కొణతాల అప్పారావు, పామర్తి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.