జమ్మూ-పూంచ్ జాతీయ రహదారి (144A)పై అఖ్నూర్‌లోని తుంగి మోర్ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో నిండుగా ఉన్న బస్సు లోతైన గుంతలో పడిపోయింది.
ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 15 మంది మృతి చెందినట్లు సమాచారం. దాదాపు 40 మంది ప్రయాణికులు గాయపడినట్లు తెలుస్తుంది. వీరిలో 20 మందిని ఈఎంసీ జమ్మూకు రిఫర్ చేశారు.
పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపడుతున్నారు. గాయపడిన వారిని కాలువలో నుంచి బయటకు తీసి అఖ్నూర్ ఉపజిల్లా ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన ప్రయాణికులను అక్కడి నుంచి జమ్మూ మెడికల్ కాలేజీకి తరలించారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. UP 86EC 4078తో ఉన్న బస్సు జమ్మూ నుండి శివఖోడి ధామ్‌కు వెళ్తోంది. శివఖోడి ధామ్ రియాసి జిల్లాలోని పౌనిలో ఉంది. ఇది కత్రాలోని మాతా వైష్ణో దేవి ఆలయానికి కేవలం 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. బస్సు అఖ్నూర్‌లోని తుంగి మోర్ వద్ద లోతైన గుంటలో పడిపోయింది. మలుపు వద్ద ఎదురుగా బస్సు రావడంతో.. డ్రైవర్ బ్యాలెన్స్ తప్పడంతో ప్రమాదం జరిగింది. బస్సు కిందపడగానే అరుపులు వినిపించాయి. సమీపంలోని ప్రజలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులకు కూడా సమాచారం అందించారు. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. బస్సు అద్దాలు పగలగొట్టి ప్రజలను బయటకు తీశారు అనంతరం క్షతగాత్రులను వాహనాల్లో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
ప్రమాద వార్త తెలియగానే ఆస్పత్రి సిబ్బంది అప్రమత్తమయ్యారు. క్షతగాత్రులు వచ్చిన వెంటనే ఇక్కడ చికిత్స ప్రారంభించారు. తీవ్రంగా గాయపడిన ప్రయాణికులను ప్రథమ చికిత్స అనంతరం జిఎంసి జమ్మూకి తరలించారు. GMC జమ్మూలో అప్రమత్తమైన వైద్యుల బృందం వెంటనే గాయపడిన వారికి చికిత్స ప్రారంభించింది. బస్సులో 75 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. SDM అఖ్నూర్ లేఖ్ రాజ్, SDPO అఖ్నూర్ మోహన్ శర్మ, పోలీస్ స్టేషన్ ఇంఛార్జి అఖ్నూర్ తారిక్ అహ్మద్ సంఘటనా స్థలంలో సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారు.