ఓ.ఎన్.జి.సి పైపు లైన్ నిర్మాణ పనులను ఆపాలి – బొమ్మిడి నాయకర్
నర్సాపురం మే17: నర్సాపురం మండలం రస్తుంబాద పంచాయితీ లో ఓ ఎన్ జి సి వారి ఆధ్వర్యంలో చేపట్టిన పైప్ లైన్ నిర్మాణ పనులను నిలుపుదల చేయాలని నర్సాపురం నియోజకవర్గం జనసేనపార్టీ ఇంచార్జ్ బొమ్మిడి నాయకర్ డిమాండ్ చేశారు. శుక్రవారం రస్తుంబాద గ్రామంలో చేపట్టిన పనులను నిలుపుదల చేయాలని గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. రస్తుంబాద జనసేనపార్టీ నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న బొమ్మిడి నాయకర్, హుటాహుటిన పైప్ లైన్ నిర్మాణ పనులు చేపడుతున్న ప్రాంతాన్ని సందర్శించి, గ్రామస్థులు , రైతులతో విషయాన్ని తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్, నర్సాపురం మండల తహసీల్దార్ మరియు ఓ. ఎన్.జి.సి అధికారులతో మాట్లాడి, తాత్కాలికంగా రైతుల పొలాల నుండి చేపట్టిన పైప్ లైన్ నిర్మాణ పనులను నిలుపుదల చేయించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో నాయకర్ మాట్లాడుతూ, సీతారామపురం నుండి వై ఎస్ పాలెం, రస్తుంబాద గ్రామాలలో రైతుల పొలాల్లో చేపట్టిన పైప్ లైన్ నిర్మాణ పనుల ద్వారా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, అంతేగాక స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని అన్నారు. వారికి న్యాయం చేయాలని అంతేగాక వారిలో ఉన్న భయాన్ని పోగొట్టిన అనంతరం ఈ పనులను చేపట్టాలని, అప్పటివరకు రైతుల పొలాల్లో చేపట్టిన పైప్ లైన్ నిర్మాణ పనులను నిలుపుదల చేయాలని ఈ సందర్బంగా బొమ్మిడి నాయకర్ డిమాండ్ చేసారు.ఈ కార్యక్రమంలో ఆకన చంద్రశేఖర్ ,బందెల రవీంద్ర, పులి భుజంగరావు, యడ్లపల్లి మహేష్, పులి శ్రీరాములు, కాకుమాళ్ళ బాబి, యడ్లపల్లి తాతాజీ, పోలిశెట్టి బాలు వెంకన్న, యడ్లపల్లి పద్మారావు సాయి, గాది ఆలం ప్రభు తదితరులు పాల్గొన్నారు.