2019 కంటే మెరుగైన ఫలితాలు : డిప్యూటీ సీఎం కొట్టు
తాడేపల్లిగూడెం,మే 16:ఈసారి ఎన్నికల్లో 2019 కంటే మెరుగైన ఫలితాలు రాబోతున్నాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవదాయ ధర్మాదాయ శాఖ మంత్రి, తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కొట్టు సత్యనారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో గురువారం రాత్రి ఆయన మాట్లాడారు. 2019లో వైయస్ జగన్మోహన్ రెడ్డి మీద ప్రజలు ఎంతో నమ్మకంతో 151 అసెంబ్లీ, 22 ఎంపీ స్థానాలు ఇచ్చారన్నారు. ఈ ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన పట్ల ప్రజలు చాలా సంతృప్తి వ్యక్తం చేశారని పేర్కొన్నారు. ఆ సంతృప్తి 2024 ఎన్నికల్లో ప్రస్ఫుటంగా కనపడబోతుందన్నారు. ఐ ప్యాక్ టీం తో సీఎం జగన్ మాట్లాడిన సందర్భంలో గతం కంటే ఎక్కువ స్థానాలు గెలుస్తున్నామని ఎంతో కాన్ఫిడెన్స్ తో చెప్పారన్నారు. దేశ రాజకీయాల్లో ఏ రాష్ట్రమైనా ప్రజా సంక్షేమ వైపు దృష్టి సారించి వారి అవసరాలు తీర్చడం కోసం పని చేయాలని సీఎం జగన్ చేసి నిరూపించారు అన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారత వంటి రంగాలలో ప్రభుత్వం మనకు అండదండలుగా ఉంటుందని ప్రజల్లో నమ్మకం కలిగించారన్నారు. *జగన్ మీద ప్రజలకు *”చెప్పాడంటే చేస్తాడంతే”* అనే ప్రగాఢ నమ్మకం కలిగిందన్నారు. ఈ కారణంగానే 2019 కంటే 2024 లో మెరుగైన ఫలితాలు వస్తాయని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు.

previous post
next post