మంచి మెజారిటీతో నేనే గెలుస్తున్నా కొట్టు జగనన్న కోసం తరలివచ్చిన మహిళా లోకం
పోలింగ్ కేంద్రాల్లో కిరాయి మనుషులతో జనసేన అల్లర్లు
నేను వెయ్యి మందితో సమానం
తాడేపల్లిగూడెం,మే 14:* తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన తాను మంచి మెజారిటీతో గెలుస్తున్నానని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తన విజయం పట్ల సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జగనన్న సంక్షేమ పాలనకు మెచ్చి మరోసారి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తెచ్చుకునేందుకు ఓటర్లు ఉదయాన్నే పోలింగ్ ప్రారంభించడానికి ముందే బారులు తీరి నిలబడ్డారన్నారు. జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకునేందుక ఓటింగు కోసం పోలింగ్ కేంద్రాల వద్ద మహిళా లోకం పోటెత్తిందన్నారు. ఓటింగ్ సరళిని పరిశీలించినా, ఓటు వేయడానికి వచ్చిన వారి హావ భావాలు పరిశీలించినా వైయస్సార్సీపీ విజయం ఖాయంగా కనిపించిందన్నారు. ప్రతి ఒక్కరు ఎంతో సంతోషంగా, ఆనందంగా వచ్చి ఓటు వేశారన్నారు. జగనన్న పాలన పట్ల ప్రజలు చాలా సంతృప్తికరంగా ఉన్నారని తేటతెల్లమైందన్నారు. తాడేపల్లిగూడెంలో ప్రత్యేకించి శాంతియుత వాతావరణం కోసం మహిళలు గుంభనంగా ఓటు వేశారన్నారు. తన ప్రత్యర్థి జనసేన పార్టీ అభ్యర్థి కిరాయి మనుషులను పోలింగ్ కేంద్రాలలో పెట్టి రౌడీయిజం, గుండాయిజం చేయడానికి ప్రయత్నాలు చేశాడని ఆరోపించారు. ఈ కారణంగానే పట్టణంలో కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద తాను ఎక్కువ సమయం ఉండవలసి వచ్చింది అన్నారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ధైర్యం కల్పించాలని ఉద్దేశంతోనే తాను కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద సమయం గడిపాను అన్నారు. ధర్మానికి, అధర్మానికి మధ్య జరిగిన యుద్ధంలో ఓటర్లు ధర్మం పక్షాన నిలిచారన్నారు. ప్రజలు ముందే నిర్ణయించుకుని వైసిపి కి ఓటు వేశారన్నారు. ప్రత్యర్థులు చెబుతున్నట్లుగానే తాను ఎప్పుడూ కూడా మంది మార్బలాన్ని తీసుకు వెళ్ళలేదని స్పష్టం చేశారు. రౌడీయిజం, గూండాయిజం చేసే వాళ్లకు ఏ సమయంలో ఎవర్నించి ప్రమాదం పొంచి ఉంటుందో అనే భయంతో కూడా మంది మార్బలాన్ని పెట్టుకుంటారన్నారు తాను ముందు నుంచి రౌడీయిజానికి, గుండాయిజానికి పూర్తి వ్యతిరేకమన్నారు తానుండగా తాడేపల్లిగూడెంలో రౌడీలు, గుండాలు ఆటలు సాగనివ్వనని, వాళ్ల కొమ్ములు విరిచేస్తానని హెచ్చరించారు. కొట్టు సత్యనారాయణ ఒక్కడే 1000 మందితో సమానమని ప్రకటించారు. మంచి ఫలితం వస్తుందని ఆశాభావంతో ఉన్నాను అన్నారు మంచి మెజార్టీతో తానే గెలుస్తున్నానని వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఏపీ స్టేట్ ఆక్వా డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ వడ్డి రఘురాం నాయుడు, ఏఎంసీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్, శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు ప్రత్యేక ఆహ్వానితులు కొట్టు నాగేంద్ర, వైఎస్ఆర్సిపి జిల్లా ఉపాధ్యక్షులు తెన్నేటి జగ్జీవన్, వైస్ ఎంపీపీ సురపని రామకృష్ణ, కొమ్ముగూడెం సొసైటీ చైర్మన్ వెలిశెట్టి నరేంద్ర కుమార్, కళింగ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ సంపతరావు కృష్ణారావు, బొద్దాని శ్రీనివాస్ లు పాల్గొన్నారు.
