తాడేపల్లిగూడెం,మే 10: ఈనెల 7వ తేదీన పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరూ లేరని, అక్కడ ఉన్న వారంతా జనసేన అల్లరి గ్యాంగ్ అని ఏఎంసీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్ స్పష్టం చేశారు. అయితే జరిగిన దానిని వక్రీకరించి కొన్ని చానల్స్ అసత్య ప్రచారం చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ ఉద్యోగులు తిరగబడినట్లుగా తప్పుడు ప్రచారం చేయడం తగదని కొట్టి పారేశారు. స్థానిక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈనెల 7వ తేదీన తాడేపల్లిగూడెంలోని శ్రీ కోడే వెంకటరావు మున్సిపల్ హైస్కూల్లో ప్రభుత్వ ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ తో పాటు తాను కూడా ఆ రోజు అక్కడికి వెళ్లడం జరిగిందని సంపత్ తెలిపారు. అయితే అభ్యర్థి గా ఉన్న కొట్టు సత్యనారాయణ మాత్రమే పోలింగ్ కేంద్రంలోకి వెళ్లారని, తాము మాత్రం బయటే ఉండిపోయాం అన్నారు. అభ్యర్థికి పోలింగ్ కేంద్రంలోకి వెళ్లే హక్కు ఉంటుందని కనీస పరిజ్ఞానం కూడా అక్కడ రోడ్డుపై ఉన్న జనసేన కార్యకర్తలకు తెలియకపోవడం వారి అజ్ఞానానికి నిదర్శనం అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు అక్కడ లేరని, కేవలం జనసేన అల్లరి మూకలు మాత్రమే మొహరించి ఉన్నాయన్నారు. దీనికి తానే ప్రత్యక్ష సాక్ష్యం అన్నారు. అభ్యర్థిగా ఉన్న కొట్టు అటువైపు వెళుతుండగా అక్కడే ఉన్న జనసేన అల్లరి మూకలు పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళకూడదు అంటూ పెద్ద పెద్ద కేకలతో అల్లరి సృష్టించారన్నారు. ఆ సందర్భంలో అభ్యర్థికి, వారికి మధ్య కొద్దిపాటి వాగ్వాదం జరిగిందన్నారు. అంతేకానీ అక్కడ ఎవరు ప్రభుత్వ ఉద్యోగులు లేరని సంపత్ స్పష్టం చేశారు. అక్కడ జరిగిన వాస్తవం ఇదైతే ప్రభుత్వ ఉద్యోగులు తిరగబడినట్లుగా కొన్ని ప్రసార మాధ్యమాల్లో ప్రసారం కావడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు వారికి కళ్ళు ఉన్నాయా అని మండిపడ్డారు. ఆ చానల్స్ కు సంబంధించిన ప్రతినిధులు కూడా ఎవరు ఆరోజు అక్కడికి రాలేదని, కేవలం జనసేన నాయకులు చెప్పిన తప్పుడు మాటలు విని ఉద్యోగులు తిరగబడినట్లుగా తప్పుడు వార్తలు ప్రసారం చేశారని సంపత్ తీవ్రంగా ఖండించారు. జనసేన కార్యకర్తలను ప్రభుత్వ ఉద్యోగులుగా వక్రీకరించి తప్పుడు వార్తలు ప్రసారం చేసిన వారిపై ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అవసరమైతే ఈ వ్యవహారంపై సాక్షాధారాలతో సహా ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని ఏఎంసీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్ తెలియజేశారు.

previous post