భూవివాదాల పరిష్కారమంటూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పథకంలోని సర్వే తప్పుల తడకగా మారింది. అస్తవ్యస్థ భూ లెక్కలతో అన్నదాతలకు సమస్యలకు పరిష్కారం చూపకపోగా కొత్త భూ సమస్యలు తెచ్చి పెడుతోందని రైతులు తలలు పట్టుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో రైతులు లేకుండానే అధికారులు రీసర్వే చేయడంతో భూ లెక్కల్లో గందరగోళం నెలకొన్న విషయం అందరికీ తెలిసిందే. దీంతో జగనన్న భూరక్ష పథకం కాస్తా భూ భక్ష పథకంగా మారిందనే విమర్శలు వచ్చాయి.
తాజాగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఈ పథకంపై స్పందిస్తూ , తెలంగాణలో కేసీఆర్ ధరణితో ఓడిపోయారనీ, అలాగే సీఎం జగన్ కూడా వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పథకంతోనే భూస్థాపితం అవుతారని తనదైన శైలిలో శాపనార్థాలు పెట్టారు. చిత్తూరు జిల్లా నగరి మండలంలోని ఆయన స్వగ్రామం ఆయనంబాకంలో భూములను పరిశీలించి ఈ వ్యాఖ్యలు చేశారు.
*ఉత్త డొల్లనే లోపల ఏమీ లేదు:* ఈ పథకంలో భాగంగా జగన్ ఫొటోతో కూడిన పాస్ పుస్తకాలు ఇస్తున్నారని నారాయణ అన్నారు. ఈ పుస్తకంలో డొల్ల తనమే తప్ప, కనీసం నాలుక గీసుకోవడానికి కూడా పనికిరాదని ఎద్దేవా చేశారు. కనీసం బ్యాంకు రుణాలు తీసుకోవడానికి కూడా పనికి రాదని, కేవలం జగన్ తన బొమ్మను అచ్చు వేసి కోట్ల రూపాయలు వృథా చేస్తున్నారని విమర్శలు చేశారు. గత ప్రభుత్వాలు ఇచ్చిన పట్టా పుస్తకాలతో అన్ని రకాలు సేవలు అందేవని, కానీ ఈ పాస్ పుస్తకంతో ఏ ఉపయోగం లేదని అన్నారు.
*జగన్ను భూరక్ష రక్షించదు:* వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన సర్వేతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నారాయణ విమర్శలు చేశారు. వేల కోట్లు ఖర్చు పెట్టి బండలు వేశారని, చివరకు ఈ బండలు పుస్తకాలు తప్ప ఏమీ ఉండదని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కేసీఆర్ను ధరణి పథకమే దెబ్బ తీసిందని, ఇప్పుడు జగన్ కూడా భూరక్షతో ఓడిపోనున్నారని తెలిపారు.