పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఫుడ్స్ ఫాట్స్ అండ్ ఫెర్టిలైజర్స్ 3F సేవా విభాగం స్వాభిమాన్ ఫౌండేషన్ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. స్వాభిమాన్ ఫౌండేషన్ అనాధ శరణాలయం ప్రాంగణంలో హైదరాబాద్ కు చెందిన ప్రముఖ ఆసుపత్రి స్టార్ ఆసుపత్రి సౌజన్యంతో ఏర్పాటు చేసిన పిల్లల గుండె చికిత్స శిబిరాన్ని ఆయన ప్రారంభించి మీడియాతో మాట్లాడారు. FFF అధినేత ఓపి. గోయింకా, సుశీల్ గోయింకా సేవా కార్యక్రమాలు అందరికీ స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే అన్నారు. చిన్నపిల్లలకు పుట్టుకతో వచ్చే గుండె సంబంధిత వ్యాధులకు ఆపరేషన్లు సామాన్య విషయం కాదని ఒకొక్క ఆపరేషన్ కు 8 నుంచి 10 లక్షలు రూపాయలు ఖర్చు అవుతుందని ఇలాంటి బృహత్తర కార్యాక్రమాన్ని స్వాభిమాన్ ఫౌండేషన్ ద్వారా చేయడం ప్రశంసనీయమన్నారు. తల్లిదండ్రులు లేని అనాధ పిల్లలకు ఎల్. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందించడంతోపాటు, హాస్టల్ సదుపాయాన్ని అత్యధిక సదుపాయాలతో ఏర్పాటు చేస్తుండటం గొప్ప విషయమని కొనియాడారు. దీంతోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో త్రాగునీరు కలుషితమయ్యే ప్రదేశాల్లో ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేయడం కూడా ప్రశంసనీయమన్నారు. వ్యాపారాలు చేయడం సంపాదించుకోవడమే పరమావధిగా ఉన్న ఈ రోజుల్లో ఇలాంటి సేవా కార్యక్రమాలకు లక్షల రూపాయలు వెచ్చించడం గొప్ప విషయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో 3F సిబ్బంది హెచ్ ఆర్ జనరల్ మేనేజర్ జున్నూరు జనార్థన్, సత్యనారయణ, మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి, ఫంక్షనల్ మేనేజర్ వేమల శ్రీనివాస్ ఫుడ్ ఫ్యాట్స్ సిబ్బంది పాల్గొన్నారు.
