ఏపీ రాష్ట్రంలో ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ తీవ్ర జాప్యమవుతోంది. ప్రవేశాల ప్రక్రియ మొదలుపెట్టి నెల దాటినా ఇప్పటికీ సీట్లు కేటాయించలేదు. ఫలితంగా ఆల్ ఇండియా కోటా సీట్లు కోల్పోతున్నామని అభ్యర్థులు, తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరితగతిన మొదటి విడత సీట్ల కేటాయింపు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
జాతీయ వైద్య కమిషన్-ఎన్ఎంసీ ఆదేశాల ప్రకారం అక్టోబర్ ఒకటి నుంచే తరగతులు ప్రారంభించాలి. ఈలోగా మొదటి, రెండో విడత కౌన్సిలింగ్ పూర్తి చేయాల్సి ఉంది. ఏపీ విద్యార్థులకు రాష్ట్రంలో మెరుగైన కళాశాలల్లో సీటు దక్కపోతే ఆల్ ఇండియా కోటాలో సీట్ల కోసం ప్రయత్నించే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ జాప్యం జరగడం, ఆల్ ఇండియా కోటా భర్తీ ముందంజలో ఉండడంతో రాష్ట్ర విద్యార్థుల్లో ఆందోళన పెరిగిపోతోంది.
మరోవైపు ప్రవేశాలకు సంబంధించి 13,849 మంది అభ్యర్థులతో కూడిన తుది ప్రాధాన్య క్రమ జాబితాను యూనివర్సిటీ సెప్టెంబర్ 12న విడుదల చేసింది. సీట్ల కేటాయింపునకు ఈనెల 17 వరకు సమయం పట్టే అవకాశముందని విశ్వవిద్యాలయ వర్గాలు చెబుతున్నాయి. సమయం మించిపోతుండడంతో మొదటి విడత పూర్తి కాకుండానే, రెండో విడత ప్రవేశాలను సెప్టెంబర్ 27న చేపడతామంటూ తాజాగా ప్రకటించారు. ఆ తర్వాత రెండు మూడు రోజుల్లో రెండో విడత కౌన్సెలింగ్ కూడా పూర్తిచేసి అక్టోబర్ 1నుంచి ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభిస్తామని అధికారులు అంటున్నారు.