ఆంధ్రప్రదేశ్‌లో ఐఏఎస్, ఐపీఎస్‌లు ఈసారైనా గాడిలో పడతారా? మళ్లీ పాత తప్పులనే పునరావృతం చేస్తారా? ఇవే ప్రశ్నలు చాలా మంది అధికారులను వెంటాడు తున్నాయి. తాజాగా బుధవారం సాయంత్రం ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న చంద్రబాబునాయుడు సచివాలయంలో తొలిసారి ఐఏఎస్, ఐపీఎస్‌లతో భేటీ అయ్యారు. ఒకప్పుడు అరగంటకు పైగానే మాట్లాడే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఈసారి కేవలం నాలుగైదు నిమిషాలు మాత్రమే వాళ్లకు సమయం కేటాయించారు. చెప్పాల్సిన నాలుగు ముక్కలను సూటిగా చెప్పేశారు. సున్నితంగా హెచ్చరించారు. అంతేకాదు బాధ్యతలు చేపట్టే సమయంలో ఐదు హామీలకు సంబంధించిన ముఖ్య కార్యదర్శులను దూరంగా పెట్టడం అధికారుల్లో గుబులు మొదలైంది.ఐదేళ్లలో జరిగిన విధ్వంసానికి, ప్రజా వ్యతిరేక విధానాలకు కొందరు ఐఏఎస్, ఐపీఎస్‌లకు కీలక పాత్ర ఉందన్నారు సీఎం. కొత్త ఇంటిని చక్కబెట్టాల్సిందిపోయి, డ్యామేజ్ చేస్తారా అంటూ కాసింత అసహనాన్ని ప్రదర్శించారట. అఖిల భారత సర్వీసులకు ఉండే గౌరవాన్ని దెబ్బతీశారని తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఈ స్థాయిలో మాట్లాడడంపై చాలామంది అధికారులు షాకయ్యారు.తనకు ఇప్పుడు సమయం లేదని, నాలుగైదు రోజుల్లో సమావేశం ఏర్పాటు చేస్తానని చెప్పారు సీఎం చంద్రబాబు. అప్పుడు అన్ని అంశాలపై సుదీర్ఘంగా చర్చిద్దామని చెప్పి కుర్చీ నుంచి పైకి లేచారు. దీంతో అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఒకప్పుడు తాడేపల్లి ప్యాలెస్‌కు తొత్తులుగా మారిన కొందరు ఐఏఎస్, ఐపీఎస్‌లు కూడా ఆ సమావేశానికి హాజరయ్యారు. సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి అయితే సీఎం చంద్రబాబు ఛాంబర్‌లోకి వెళ్లారు. ముఖ్యమంత్రి కొంత అసహనంగా చూడడంతో సీఎస్ ఆమెని అక్కడి నుంచి పంపించేశారు. ఇక ఐపీఎస్ అధికారి ఆంజనేయులు కూడా సీఎం ఛాంబర్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా, ఇంటెలిజెన్స్ చీఫ్ కుమార్ విశ్వజీత్ ఆయన వద్దకు వెళ్లి మీటింగ్ హాలులో ఉండాలని చెప్పి పంపించేశారు.సీఎం చంద్రబాబుకు మాజీ సీఐడీ చీఫ్ సునీల్‌కుమార్ పుష్పగుచ్చం ఇవ్వగా ఆయన వైపు కన్నేత్తి కూడా చూడలేదు. ఇక గనుక శాఖ కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది కూడా సీఎం కు పుష్ప గుచ్చం ఇవ్వడానికి ప్రయత్నించారు. సీఎం చంద్రబాబు ఆయన వైపు కనీసం చూడకుండానే వెళ్లిపోయారు. సీఎం చంద్రబాబు ఐదు సంతకాలకు సంబంధించిన జీవోలను సంబంధిత శాఖల కార్యదర్శులు జారీ చేయాల్సివుంది. కాకపోతే వారందరినీ దూరంగా పెట్టారు. కేవలం సీఎస్ సంతకాలతో అవన్నీ వెలువడ్డాయి. డీఎస్సీపై ప్రవీణ్ ప్రకాశ్, అన్న క్యాంటీన్లపై శ్రీలక్ష్మి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై అజయ్‌జైన్, పింఛన్లు పెంపుపై శశిభూషన్ సంతకాలతో జీవోలు జారీ చేయాల్సివుంది. చంద్రబాబు సర్కార్‌లో వీరెవ్వరికీ ఆ ఛాన్స్ ఇవ్వలేదు.

previous post