పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు
* గెలుపు ఓటములు రాజకీయాల్లో సహజం
* విలేకరుల సమావేశంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్
రాజమహేంద్రవరం, జూన్ 06 :
రాజకీయాలలో గెలుపు ఓటములు సహజమని, దానిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని రాజమహేంద్రవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ అన్నారు. గురువారం రాజమండ్రి తిలక్ రోడ్ లోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షులు తోట రామకృష్ణ తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత మూడు నెలల కాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కృషి చేసిన నాయకులు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.
పదవులు శాశ్వతం కాదని జీవితంలో కష్టాలు శుభాలు ఉన్నట్లే ఎన్నికలలో జరుగుతుందని అన్నారు. జనరల్ ఎన్నికలలో ఒక గాలి వేస్తుందని ఆ గాలి వైపు ప్రజలు ఉంటారని అన్నారు. మేము ఇప్పుడు ఎందుకు ఓడిపోయాం అనేది పరిస్థితులు సమీక్షించుకొని రానున్న రోజులలో ప్రజల మద్దతుతో అఖండ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మా ప్రభుత్వం అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందించి మేలు చేసిందని అన్నారు. కానీ ఎక్కడ లోపం జరిగిందో అంతు చిక్కడం లేదని అన్నారు. ముఖ్యంగా మహిళలు మైనార్టీలు ఎస్సీ ఎస్టీ బీసీలకు లబ్ధి చేకూర్చిన పథకాలు అమలు చేశామని అన్నారు.
తెలుగుదేశం పార్టీ వారు అలవు కాని పథకాలతో హామీలు ఇచ్చారని వివరించారు. అమ్మ ఒడి 18 ఏళ్లు దాటినా యువతులకు 1500 రూపాయలు పెన్షన్ , సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు, నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారని అన్నారు. ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలల వరకు ఇచ్చిన హామీలు ఎంత వరకు అమలు చేస్తారో చూస్తామని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రజల తరపున ప్రభుత్వంపై పోరాడుతామని అన్నారు. పార్టీ కోసం రాత్రి, పగలు అనక కష్టపడి పని చేసిన సీనియర్ నాయకులకు కార్యకర్తలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. జీవితంలో గెలుపు ఓటములు సహజమని ధైర్యంగా ఉండాలని పిలుపు ఇచ్చారు. పిరికితనం చావు లాంటిదని, పిరికివాడు ఎప్పుడూ చస్తుంటాడని ధైర్యవంతుడు ఒకేసారి చస్తాడని కార్యకర్తలలో మనోధైర్యాన్ని నింపారు. మన నాయకుడుకు ధైర్యం, ఆత్మస్థైర్యం
ఎక్కువ అని దానిని అలవర్చుకోవాలని హితవు పలికారు. పార్టీ ఆదేశాల మేరకు నాయకులు కార్యకర్తలు నిబద్ధతతో పనిచేసి ముందుకు నడవాలని అన్నారు. కష్టకాలంలో పార్టీకి అండగా ఉండి అంకితభావంతో అందరూ పనిచేయాలని సూచించారు.
రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశరావు మాట్లాడుతూ రాజకీయాలలో పార్లమెంట్ స్థానానికి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ లాంటి వ్యక్తులు పోటీ చేయడం అరుదని అన్నారు. రాజకీయాల్లోకి వచ్చిన మొదటిసారి ఐదు లక్షల ఓట్లతో ప్రజలు ఆయనను ఆశీర్వదించారని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి డాక్టర్ గా రాజకీయాల్లోకి వచ్చారని, అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ను రాజకీయాల్లోకి తీసుకువచ్చారని అన్నారు. ఎన్నికలలో ఓటమిని పరిశీలిస్తే అమలు కానీ హామీలను టిడిపి ప్రకటించిందని అన్నారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై ప్రజలలో అపోహలు సృష్టించిందని వివరించారు. ఈ చట్టం కేంద్రం తీసుకు వచ్చిందని, అన్ని రాష్ట్రాలలో అమలులో ఉందని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాను ప్రకటించిన మేనిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీత వలె నమ్మి అమలు చేశారని అన్నారు. అవాస్తవాలు నమ్మి ప్రజలు తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. రాజకీయాలలో గెలుపు ఓటమిలు సహజం అన్నారు. టిడిపి ప్రకటించిన హామీలు అమలు చేసే వరకు పోరాటం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్, తగరం సురేష్ బాబు, వాకచర్ల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
…………………………….