జీవితాంతం సమాజ సేవకే అంకితమైన పరిపూర్ణ వ్యక్తి కందుకూరి
భీమవరం మే 27 : జీవితాంతం సమాజ సేవకే అంకితమైన పరిపూర్ణ వ్యక్తి కందుకూరి వీరేశలింగం పంతులు అని డిఎన్నార్ కళాశాల పాలకవర్గ సహాయ కార్యదర్శి కొత్తపల్లి శివరామరాజు, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అంజన్ కుమార్ అన్నారు. శ్రీవిజ్ఞానవేదిక, కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో కళాశాల గ్రంథాలయంలో కందుకూరి వీరేశలింగం పంతులు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. వారు మాట్లాడుతూ తెలుగు జాతికి నవయుగ వైతాళికుడు కందుకూరి వీరేశలింగం పంతులని, తెలుగు గడ్డపై తొలితరం సంఘ సంస్కర్త, మహిళల సంక్షేమం కోసం జీవితాంతం పని చేసారని, స్త్రీ విద్య కోసం ఉద్యమించి బాలికల పాఠశాలను స్థాపించారని, బాల్య వివాహాలను వ్యతిరేకించి, వితంతు పునర్వివాహాలు చేయించారని అన్నారు. రచయిత కలిగొట్ల గోపాల్ శర్మ, కళారంజని నాటక పరిషత్ అధ్యక్షులు జవ్వాది శ్రీనివాస్ మాట్లాడుతూ సమాజంలోని దురాచారాలను రూపుమాపడానికి కృషి చేసారని, ఆ క్రమంలో సంఘంలోని అవకతవకలను ఎత్తి చూపారని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ స్త్రీ విద్య కావాలి
అని నినాదాలు చేయడం మాత్రమే కాకుండా దాన్ని సాధించడం కోసం బాలికా విద్యాలయం ప్రారంభించిన మహనీయుడు కందుకూరి అని అన్నారు. అనంతరం విద్యార్థులకు పోటీలను నిర్వహించి రచయిత కలిగొట్ల గోపాల్ శర్మ, కళారంజని నాటక పరిషత్ అధ్యక్షులు జవ్వాది శ్రీనివాస్ లను సత్కరించారు. కార్యక్రమంలో పట్టణ లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు నరహరి శెట్టి కృష్ణ, లైబీరియన్ కే శిరీష, ఎస్ కే బాబాజీ, ప్రవీణ్ విద్యార్థులు పాల్గొన్నారు.