కలెక్టర్ ను కలిసిన మాజీ ఎమ్మెల్యే అంజిబాబు
* కౌంటింగ్ లో తీసుకోవాల్సిన విధివిధానాలపై చర్చ
* వివరాలను తెలియజేసిన కలెక్టర్
భీమవరం మే 24 : జూన్ 4నా జరిగే కౌంటింగ్ విషయాలపై జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీని మాజీ ఎమ్మెల్యే, భీమవరం కూటమి ఎమ్మెల్యే అభ్యర్ధి పులపర్తి రామాంజనేయులు అడిగి తెలుసుకున్నారు. కౌంటింగ్ సమయం, ఎన్ని టేబుల్స్, ఎన్ని రౌండ్స్ లో ఫలితాలు వెలువడుతాయని, ఎంతా మంది లోపలకి అనుమతి ఇస్తారు తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని, కౌంటింగ్ సూపర్‌వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు (రిజర్వ్ సిబ్బందితో సహా) ఉదయం 6.00 లోపు కౌంటింగ్ సెంట ర్‌లో రిపోర్ట్ చేస్తారని, లెక్కింపు కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. స్ట్రాంగ్ రూమ్ లు ఉదయం 7.00 గంటలకు తెరవబడతాయని, వెంటనే ఈవీఎంలను పోటీలో ఉన్న అభ్యర్థుల సమక్షంలో తరలించడం జరుగుతుందని, కౌంటింగ్ ఏజెంట్లు, కౌంటింగ్ సూపర్‌వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు ఉదయం 7.00 గంటలకు తమ తమ సీట్లలో కూర్చున్న తర్వాత కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎవరూ కౌంటింగ్ హాల్ నుండి బయటకు వెళ్లడానికి అనుమతించబడదన్నారు. ప్రతీ గదిలో సిసి టివి ఉంటుందని, ఇవిఎంలు తీసుకువచ్చిన దగ్గర నుంచి ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యే వరకు వీడియో రికార్డింగ్ కూడా నిర్వహిస్తామని తెలిపారు. ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా తమ గుర్తింపు కార్డును ధరించాలని, అవి లేకపోతే లోపలికి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తొలివిడత లెక్కింపు, మలివిడత లెక్కింపు ప్రక్రియలను వివరించారు. టిడిపి రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు ఉన్నారు.