భీమవరం మే 21 :మంగళవారం స్థానిక కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అజిత వేజెండ్ల సంయుక్తంగా కౌంటింగ్ ఏర్పాట్లు, లెక్కింపు, బందోబస్తు, తదితర ఏర్పాట్లపై రిటర్నింగ్ అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి సుమిత్ కుమార్ మాట్లాడుతూ కౌంటింగ్ ఏర్పాట్లు నేపధ్యంలో చట్టపరమైన నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు. కౌంటింగ్ హల్ లోకి మొబైల్ ఫోన్లు అనుమతి లేదని, ఈ మేరకు సంబందిత సిబ్బంది ఖచ్చితమైన తనిఖీలు నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు. విష్ణు కాలేజ్ ఆవరణలోకి ఎటువంటి వాహనాలు అనుమతించడం లేదని, విష్ణు కాలేజీ వెలుపల మాత్రమే పార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నారు. ఉదయం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపుకు సంబంధించి కార్యచరణ సిద్ధం చేసుకుని అమలు చేయాలన్నారు. కౌంటింగ్ సిబ్బంది తప్ప మిగతా ఎవ్వరినీ కౌంటింగ్ ప్రాంతంలోకి అనుమతించరాదన్నారు. రిటర్నింగ్ అధికారి యొక్క మొబైల్ ఫోన్ మాత్రమే కౌంటింగ్ హాల్ లోకి తీసుకుని వెళ్ళే అవకాశం ఉందని, వాటి ద్వారా రౌండ్ ల వారీగా సమాచారం ఇవ్వవలసి ఉంటుందని తెలిపారు. ఓట్ల లెక్కింపుకు సరిపడా సిబ్బంది నియామకం చేపట్టాలన్నారు. అధికారిక కమ్యూనికేషన్ విభాగంలో అధికారులకు, సిబ్బందికి సిట్టింగ్ ఏర్పాట్లూ, ఎస్టిడి, ఫ్యాక్స్, ప్రింటర్ & ఇంటర్నెట్ సౌకర్యంతో పాటు ప్రధాన ఎన్నికల అధికారికి తక్షణ సమాచారం కోసం హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ కంప్యూటర్ తో పాటు ఒక హాట్‌లైన్ ఏర్పాటు చేసుకోవాలని వీటి పర్యవేక్షణ కోసం సీనియర్ అధికారిని నియమించాలన్నారు. పరిశీలకుల గదిలో, ఫోన్, ఫ్యాక్స్, ఇంటర్నెట్, టీవీ, ప్రోటోకాల్ బృందం, సిబ్బంది అందుబాటులో ఉంచడం కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మీడియా సెంటర్ కు ప్రత్యేక హాల్, మౌలిక వసతులు, టెలిఫోన్, ఇంటర్నెట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ పరిశీలన కోసం మీడియా ప్రతినిధులను నిర్దేశించిన ప్రదేశం వరకే అనుమతించడం జరుగుతుందన్నారు. మీడియా సెంటర్ వరకూ మొబైల్ ఫోన్‌లను అనుమతించవచ్చునని తెలియచేశారు.
కౌంటింగ్ సమయంలో రిటర్నింగ్ అధికారి ఏ నిర్ణయం తీసుకుంటారో అదే తుది నిర్ణయంగా పరిగణించబడుతుందన్నారు. రౌండ్ ల వారి సమాచారం అందించడంతోపాటు, ఇతర ముఖ్యమైన అనౌన్స్మెంట్కు కౌంటింగ్ హాల్లో పబ్లిక్ అడ్రెస్సింగ్ సిస్టం ఏర్పాటు చేయాలన్నారు. కౌంటింగ్ హాల్ నందు కంప్యూటర్ సౌకర్యాలు, ఎన్ కోర్ సైట్ లో సమాచారం క్రోడీకరించడానికి తగిన సిబ్బంది ని ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు. ప్రతి టేబుల్ వద్ద స్టేషనరీ మరియు ఇన్ఫర్మేషన్ షీట్లు, అదనపు సిబ్బంది కోసం ఏర్పాట్లు, మొబైల్ ఫోన్‌ల డిపాజిట్ కౌంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కౌంటింగ్ ఏజెంట్స్ కు నియామక ఉత్తర్వులు, టేబుల్ కేటాయింపులు కోసం చర్యలు తీసుకోవాలని అన్నారు. రౌండ్ వారీగా వివరాలు సంబంధిత రిటర్నింగ్ అధికారి డిజిగ్నిడేటెడ్ అధికారిని నియమించుకుని, వారీ ద్వారా మీడియా విభాగంకు సమాచారం అంద చెయ్యాలన్నారు. భద్రతా ఏర్పాట్లు నేపధ్యంలో ఈ వి ఎమ్ ల రవాణా కోసం బారికేడ్ లని ఏర్పాటు చేసుకోవడం, ప్రవేశ ద్వారం, మళ్లింపు కోసం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని కోరారు. కౌంటింగ్ కేంద్రంలోకి మీడియా ఏ ప్రాంతం వరకు అనుమతించబడుతుందో గుర్తించడానికి సైన్ బోర్డులు ఏర్పాటు చేసుకోవాలన్నారు. లా & ఆర్డర్ విషయంలో ఖచ్చితత్వం పాటించాలని, శాంతియుత విధానంలో లెక్కింపు ప్రక్రియ నిర్వర్తించడం లో అందరూ సమిష్టి బాధ్యత వహించాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.
జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అజిత వేజెండ్ల మాట్లాడుతూ పోలింగ్ ప్రశాంతంగా పూర్తి చేసుకోవడానికి కృషిచేసిన అధికారులందరకు అభినందనలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో కౌంటింగ్ ను కూడా పూర్తి చేయాలన్నారు. జిల్లాలో శాంతిభద్రతలకు ఎవరైనా విఘాతం కలిగిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేదిలేదని స్పష్టం చేశారు. పోలీస్ యంత్రాంగం అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని, సంఘటన జరగటానికి ఆస్కారం లేకుండా నిరోధించడానికి ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలన్నారు. బాటిల్స్, టిన్స్ ద్వారా పెట్రోలు అమ్మకాలను నిషేధించినట్లు తెలిపారు. తప్పనిసరి పరిస్థితుల్లో సంబంధిత తాహసిల్దార్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. బాణాసంచా తయారీ, రవాణా, వినియోగంపై జిల్లా వ్యాప్తంగా నిషేధాజ్ఞలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాల కౌంటింగ్ మరియు ప్రకటనలో గెలుపొందిన అభ్యర్ధులు వారి మద్దతుగా విజయోత్సవాలు నిర్వహించే క్రమంలో బాణాసంచా కాల్చడం వాటివల్ల తలెత్తే వివిధ పరిణామాలను దృష్టిలో వుంచుకొని నిషేధాజ్ఞలను అమలు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా జాయింటు కలెక్టరు, ఉండి అసెంబ్లీ నియోజక వర్గ రిటర్నింగు అధికారి సి.వి.ప్రవీణ్ ఆదిత్య, జిల్లా రెవిన్యూ అధికారి జె.ఉదయ భాస్కర రావు, జిల్లా అడిషనల్ ఎస్పీ వి.భీమారావు, ఏపీ టూరిజం జె.డి మరియు ఆచంట నియోజకవర్గం రిటర్నింగు అధికారి వి.స్వామి నాయుడు, కెఆర్ సి డిప్యూటీ కలెక్టరు మరియు పాలకొల్లు రిటర్నింగు అధికారి బి.శివనారాయణ రెడ్డి, నరసాపురం ఆర్డీవో మరియు రిటర్నింగ్ అధికారి యం.అచ్యుత అంబరీష్, భీమవరం ఆర్డీవో మరియు రిటర్నింగ్ అధికారి కె.శ్రీనివాసులు రాజు, తణుకు మున్సిపల్ కమీషనరు మరియు రిటర్నింగ్ అధికారి బి.వెంకట రమణ, తాడేపల్లిగూడెం ఆర్డీవో మరియు రిటర్నింగ్ అధికారి కె.చెన్నయ్య, , ట్రైనీ డిప్యూటీ కలెక్టరు కానాల సంగీత్ మాధుర్, డియస్పి లు జి.శ్రీనివాస రావు, డి.యస్.ఆర్.యస్. యన్.మూర్తి, వి.నారాయణ స్వామి రెడ్డి, ఎలక్టన్ సూపరింటెండెంట్ సి.హెచ్.దుర్గా ప్రసాదు, డిప్యూటీ తహాశీల్దారు యం.సన్యాసి రావు, తదితరులు పాల్గొన్నారు.