సంక్షేమం” వైపే ఓటర్లు “మొగ్గు
2024 ఎన్నికల్లో ఇదే ప్రధాన అంశం
గూడెంలో అభివృద్ధి, శాంతిభద్రతలు, అభ్యర్థి వ్యక్తిత్వం అదనపు అంశాలు
*తాడేపల్లిగూడెం,మే 15: 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినంతవరకు సంక్షేమం ప్రధాన అంశంగా నిలిచింది. ఓటర్లు సంక్షేమం వైపు మొగ్గు చూపించినట్లు స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయి. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అమలు చేశారు. ఈ పథకాల లబ్ధిని నేరుగా లబ్ధిదారులు ఖాతాలలోకి జమ అయ్యేలా డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ (డిబిటి) విధానాన్ని అమలు చేశారు. పథకాలు పొందడంలో ప్రభుత్వానికి, లబ్ధిదారుడికి మధ్యన వాలంటీరు పాత్ర తప్పితే మరో వ్యక్తి ప్రమేయం లేకుండా చేశారు. అది కూడా కేవలం పథకాలకు అర్హులైన వారు ఆ పథకం పొందేలా అవసరమైన ప్రాథమిక డాక్యుమెంటేషన్ ప్రక్రియ తప్ప వాలంటీర్ కు ఇక ఎలాంటి సంబంధం లేదు. ప్రభుత్వం నుంచి నేరుగా ముఖ్యమంత్రి బటన్ నొక్కడం, ఆ పథకం తాలూకు డబ్బులు వచ్చి ఆ లబ్ధిదారుల ఖాతాలో జమ కావడం ఇంతకుమించి ఏ ఇతర ప్రక్రియ లేదు. దీంతో లబ్ధిదారులకు, ప్రభుత్వానికి డైరెక్ట్ కనెక్టివిటీ ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో విభజనకు ముందు, ఆ తర్వాత కూడా ఎప్పుడు ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేసిన చరిత్ర లేదు. మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే ఈ ఎన్నికల్లో ఇటు అధికారపక్షం కానీ, అటు ప్రతిపక్ష పార్టీల కూటమి గాని ఏదైనా సరే సంక్షేమాన్ని ప్రధాన ప్రచారాంశం గా తీసుకోవడం.
*ఓటు వేసేందుకు పోటెత్తిన లబ్ధిదారులు*
ఈసారి పోలింగ్ లో మరొక ప్రధాన అంశం ఇది. ఎందుకంటే పోలింగ్ ప్రారంభ సమయానికి ముందే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు వేయడానికి వందల సంఖ్యలో బారులు తీరారు. వీరిలో అత్యధిక శాతం వృద్ధులు, మహిళలు ఉండడం గమనార్హం. ఎందుకంటే వృద్ధులకు వైయస్సార్ పెన్షన్ కానుక పేరుతో ప్రతి నెల ఒకటవ తేదీన తెల్లవారక ముందే వాలంటీర్ ఇంటికి వచ్చి తలుపు తట్టి ఎలాంటి ఆధారం లేని ఆ అవ్వ తాతలకు, నిర్భాగ్యులైన అక్క చెల్లెమ్మలకు, విభిన్న ప్రతిభావంతులకు…ఇలా వివిధ వర్గాల వారికి పెన్షన్ డబ్బులు అందజేసేవారు. గత రెండు నెలలుగా ఈ పనికి వాలంటీర్లను దూరం చేయడంతో పెన్షనర్లు పడ్డ కష్టాలు వర్ణనాతీతం. ఇలాంటి వారంతా వాలంటీర్లు ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చే రోజు కోసం ఎదురు చూస్తూ కసిగా ఓటింగ్ కు రావడం కనిపించింది. ఇక ఓటు వేయడానికి వచ్చిన వారిలో మహిళలు ఎక్కువగా ఉన్నారు. వీరంతా కూడా ఏదో ఒక సంక్షేమ పథకం ద్వారా ఆర్థిక లబ్ధి పొందిన వారే ఎక్కువమంది అనడంలో అతిశయోక్తి లేదు. అది అమ్మఒడి కావచ్చు…రైతు భరోసా కావచ్చు…వైయస్సార్ ఆసరా కావచ్చు…వైయస్సార్ చేయూత కావచ్చు…జగనన్న విద్యా దీవెన కావచ్చు… జగనన్న వసతి దీవెన కావచ్చు….ఇలా ఏ సంక్షేమ పథకమైనా కావచ్చు. ఒకటి కాదు రెండు కాదు మూడు నాలుగు రకాల సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక లబ్ధి పొందిన కుటుంబాలు కూడా ఉన్నాయి. 45 నుంచి 60 సంవత్సరాలు లోపు వయసు కలిగిన మహిళలకు ఇచ్చిన వైయస్సార్ చేయూత పథకం ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఇక వైయస్సార్ ఆసరా పేరుతో డ్వాక్రా రుణమాఫీ ద్వారా మహిళలకు అందిన ఆర్థిక సహాయం ప్రభావం కూడా స్పష్టమైంది. పిల్లల చదువులకు ఇచ్చిన అమ్మఒడి విద్యా దీవెన, వసతి దీవెన పథకాల ప్రభావం కూడా కనిపించింది. ఇలా సంక్షేమ పథకాల ప్రభావం ఈ ఎన్నికల్లో తేటతెల్లమైంది.
2014 ఎన్నికల్లో…
ప్రస్తుత ఎన్నికలకు ముందు జరిగిన గత రెండు సార్వత్రిక ఎన్నికలను పరిశీలిస్తే ఈసారి సంక్షేమం మీద ఎన్నిక నడిచింది అనేది నిర్వివాదాంశం. ఎందుకంటే ఒకసారి 10 ఏళ్లు వెనక్కు వెళ్లి 2014 సార్వత్రిక ఎన్నికలను పరిశీలించినట్లయితే…. రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగిన తొలి ఎన్నికలు అవి. అప్పటికే మన రాష్ట్రానికి రాజధాని లేదు. అంతకుముందు చంద్రబాబు నాయుడు హైదరాబాదును, హైటెక్ సిటీని అభివృద్ధి చేసిన గుర్తింపు పొందారు. దాంతో *2014 ఎన్నికల్లో రాజధాని లేని మన రాష్ట్రానికి అనుభవజ్ఞుడైన చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాజధాని కడతారని, రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందని ప్రజల్లో ఒక వేవ్ వచ్చింది.* ఆ వేవ్ పని చేసి 2014 ఎన్నికల్లో టిడిపి విజయం సాధించింది.
*2019 ఎన్నికల్లో…*
ఇక 2019 ఎన్నికలు వచ్చేసరికి రాజధాని నిర్మాణం,రాష్ట్రం అభివృద్ధి అంశాలలో చంద్రబాబుపై ప్రజలు పెట్టుకున్న ఆశలు అడియాసలు అయ్యాయి. దీనికి తోడు అప్పటికే పదేళ్లుగా వైయస్ జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి సుదీర్ఘ పాదయాత్రతో అన్ని వర్గాల ప్రజలతో మమేకమయ్యారు. ప్రజాసేవ పట్ల అకుంఠిత దీక్ష, కార్యదక్షపరుడుగా గుర్తింపు సాధించారు. అంతకుముందు ఆయన తండ్రి దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పాలనను ప్రజలు చూశారు. దీంతో పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రజా సేవకు పరితపిస్తూ జగన్ ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. ఫలితంగా *రాష్ట్రవ్యాప్తంగా జగన్ కు ఒకసారి అవకాశం ఇచ్చి చూద్దాం…* అని అభిప్రాయం సర్వత్ర వ్యాపించింది. అది బాగా వర్కౌట్ అయ్యి 2019లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 151 స్థానాలు గెలిచి రికార్డు విజయాన్ని నమోదు చేసింది.
*2024 లో….*
ఇలా పైన సమీక్షించినట్లుగా 2014లో రాజధాని లేని రాష్ట్రం చంద్రబాబు అయితే బాగుంటుంది అనే వేవ్ వర్కౌట్ కాగా, 2019లో జగన్ కు ఒకసారి అవకాశం ఇచ్చి చూద్దాం అనే వేవ్ వర్కౌట్ అయింది. ఇక ప్రస్తుతం జరిగిన *2024 సార్వత్రిక ఎన్నికలకు వచ్చేసరికి సంక్షేమం వేవ్ కనిపించింది.* ఎందుకంటే మనం ముందుగానే చెప్పుకున్నట్లుగా ఇటు అధికారపక్షం కానీ, అటు ప్రతిపక్ష పార్టీల కూటమి గాని రెండు కూడా సంక్షేమాన్ని ప్రధాన ప్రచార అస్త్రంగా మలుచుకున్నాయి. సంక్షేమం మీద చర్చ నడిచినంత సేపు ఇప్పటికే గత ఐదేళ్లుగా సంక్షేమాన్ని చేసి చూపించిన అధికార పక్షానికి అనుకూలంగా ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఐదేళ్లపాటు సంక్షేమాన్ని చేసి చూపించడమే కాకుండా మళ్లీ అధికారం ఇస్తే మరో ఐదేళ్లు సంక్షేమం కొనసాగిస్తామని అధికారపక్షం డంకా భజాయించి చెప్పింది. *ఐదేళ్లుగా సంక్షేమ ఫలాలు రుచిచూసిన లబ్ధిదారులు మరో ఐదేళ్లు ఆ ఫలాలు అందుకోవాలని ఆత్రుతలో ఉన్నట్లుగా పోలింగ్ సరళి స్పష్టమవుతోంది.* ఇక కూటమి ప్రకటించిన సూపర్ సిక్స్ పై జనంలో అంతగా చర్చ జరగలేదు ఆ పార్టీల నాయకులు కూడా సమర్థవంతంగా వీటిని ప్రజల్లోకి తీసుకు వెళ్లలేదని చెప్పాలి. ఎందుకంటే ఎంతసేపు ఎక్కడికి అక్కడ ఆయా నియోజకవర్గాల్లో అధికార పార్టీ అభ్యర్థుల అవినీతి, అహంకారం, అధికార దుర్వినియోగం వంటి అంశాల మీదే కూటమి ఎక్కువగా ఫోకస్ పెట్టింది. దీంతో *సూపర్ సిక్స్ వెనకబడిపోయింది.* *ప్రజలు విశ్వసనీయతను పొందలేకపోయింది.* అయినప్పటికీ మూడు పార్టీలు కలిసి *కూటమి* గా పోటీ చేయడంతో *కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో *నువ్వా… నేనా… అన్నట్లుగానే పోటీ ఇచ్చిందని చెప్పాలి.* అయితే ఈ పోటీ సంక్షేమం ముందు ఎంతవరకు నిలబడుతుంది అనేది చూడాలి.
*తాడేపల్లిగూడెం గురించి….*
తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గాన్ని పరిశీలిస్తే సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి,శాంతిభద్రతలు, అభ్యర్థులు నేపథ్యాలు కూడా ఇక్కడ ప్రధాన అంశాలుగా నిలిచాయి. అధికార పార్టీ అభ్యర్థికి సంక్షేమంతో పాటు అభివృద్ధి, శాంతి భద్రతల అంశాలు కలిసి వచ్చాయని చెప్పాలి. అలాగే ఓటర్లు అభ్యర్థుల నేపథ్యాలను కూడా బేరీజు వేసినప్పుడు అధికార పార్టీ అభ్యర్థికి ప్లస్ మార్కులు పడినట్లు తెలుస్తోంది. ఇక కూటమి విషయానికి వస్తే పైకి కనిపించే హడావిడితోపాటు లోపల ఏమైనా ఉందో లేదో తెలియాలంటే జూన్ 4వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.*