సత్వరమే గోనెసంచులు ఇవ్వాలని మల్లవరం రైతుభరోసా వద్ద ధర్నా
నరసాపురం రూరల్ మే 14: వెంటనే గోనెసంచులిచ్చి ధాన్యం కొనుగోలు చేయాలని కౌలురైతుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మామిశెట్టి రామాంజనేయులు డిమాండ్ చేశారు. మల్లవరం రైతుభరోసా వద్ద కౌలురైతులతో ఆందోళన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక ప్రక్క వాతావరణం మారిపోయి రైతులు ధాన్యం మాసూలు చేసేందుకు నానా ఇబ్బందులు పడుతూ ధాన్యం పట్టేందుకు సంచులకోసం రైతుభరోసా చుట్టూ తిరుగుతన్న పట్టించు కోవడం లేదన్నారు. కౌలురైతులు ధాన్యం పట్టాలంటే సంచులు లేక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే గోనెసంచులు సంచులు ఇవ్వాలని రైతుభరోసా పరిధిలో ఇంకా 20 వేల సంచులు అవసరం ఉందన్నారు. సమస్యను జిల్లా డి.ఎస్.ఒ దృష్టికి తీసుకెళ్లారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ మండల అధికారులతో మాట్లాడి వెంటనే సంచులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారన్నారు. తక్షణం రైతుభరోసా అధికారులు, సహకార సొసైటీ సిబ్బంది మిల్లుల వద్ద ఉన్న సంచులను వాహనాలు ఏర్పాటు చేసి రప్పించాలని డిమాండ్ చేశారు. కౌలురైతులు పిల్లి కామేశ్వరరావు, యండాప జీవరత్నం,మందపాటి నర్శింహరావు, పులఖండం నారాయణరావు, బారతాల బ్రహ్మజి,మహేంద్ర తదితరులు పాల్గొన్నారు.