ఖమ్మం:పేదలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందాలంటే బీజేపీతోనే సాధ్యమని పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా అన్నారు.పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో సోమవారం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు.ప్రధాని నరేంద్ర మోదీ అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని,పదేళ్లలో దేశం అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిచిందని అన్నారు.దేశంలో 80 కోట్ల మంది పేదలకు ఉచితబియ్యం, 75 ఏళ్లు నిండిన వారికి ఆయుష్మాన్ భారత్ అందిస్తున్న ఘనత తమదేనన్నారు.
రాబోయే రోజుల్లో ఏడు కోట్ల కుటుంబాలకు పైపులైన్ ద్వారా వంటగ్యాస్ అందించడమే లక్ష్యమని చెప్పారు. కాంగ్రెస్ కుటుంబపాలన సాగుతోందని, దానికి అండగా నిలిచిన పార్టీలదీ అదే చరిత్ర అని ఆరోపించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని రంగాల్లో అవినీతి జరిగిందని నడ్డా ఆరోపించారు. లోకసభ ఎన్నికల్లో ఖమ్మం, మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థులుగా తాండ్ర వినోదారావు, సీతారాంనాయకు గెలిపించాలని కోరారు.