వందేభారత్ రైళ్ల(Vande Bharat Trains)లో అందించే వాటర్ బాటిళ్ల పరిమాణాన్ని తగ్గించాలని భారతీయ రైల్వే శాఖ నిర్ణయించింది. ఇది దేశవ్యాప్తంగా నడిచే వందేభారత్ రైళ్లకు కూడా వర్తించనుంది. ఈ మేరకు ప్రయాణికులకు కేవలం 500 ml నీటిని మాత్రమే అందజేయనున్నారు. పూర్తి సమాచారం ఈ కథనంలో..
దేశవ్యాప్తంగా వందే భారత్ రైళ్లు అత్యంత ప్రజాదరణ పొందుతున్నాయి. వేగవంతంగా గమ్యస్థానానికి చేర్చడంతో ప్రజలు ఎక్కువగా వందే భారత్ రైళ్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రధాన నగరాలను కలుపుతూ ఈ సెమీ హై స్పీడ్ రైళ్లు సేవలందిస్తున్నాయి. అయితే వందే భారత్ రైలు కొన్ని నిర్దిష్ట స్టేషన్లలో మాత్రమే ఆగడం వల్ల ప్రయాణికులు బయటి నుంచి ఆహారాన్ని కొనుగోలు చేయడం కుదరడం లేదు.
ఈ క్రమంలో వందే భారత్ రైలు టిక్కెట్ల(Water Supply In Vande Bharat Trains)ను బుక్ చేసుకునేటప్పుడే.. ప్రయాణికులు ఫుడ్ కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. దీని ద్వారా మీరు కూర్చున్న చోటుకే భోజనం సరఫరా అవుతుంది. అయితే భోజనంతో పాటు ప్రయాణీకుడికి ఒక లీటర్ వాటర్ బాటిల్ కూడా రైల్వే శాఖ అందిస్తోంది. ఇప్పుడు లీటర్ వాటర్ బాటిల్ అందించే విధానాన్ని మార్చనున్నారు.
వందే భారత్ రైళ్లలో ప్రయాణించే చాలా మంది ప్రయాణికులు తమ ప్రయాణ సమయంలో ఈ ఒక లీటర్ వాటర్ బాటిల్‌ను పూర్తిగా ఉపయోగించుకోలేరు. సగం తాగిన తర్వాత మిగిలిన సగం వాటర్‌తో ఉన్న బాటిల్‌ను పడేస్తున్నారు. దీంతో తాగునీరు వృథా అయిపోతుంది. దీనికి రైల్వే అధికారులు పరిష్కారం కనుగొంటూ కొత్త నిర్ణయం తీసుకున్నారు.
ఈ నిర్ణయం ప్రకారం, ఇక నుంచి వందేభారత్ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులందరికీ ఆహారంతో పాటు 500 ml వాటర్ బాటిల్ మాత్రమే అందించనున్నారు. ఈ వాటర్ బాటిల్ అయిపోతే, ప్రయాణికులు అడిగితే మరో 500 ml వాటర్ బాటిల్ ఇచ్చేలా ఏర్పాటు చేశారు. కాగా రెండవ 500 ml వాటర్ బాటిల్ కోసం ప్రయాణికులు ఎటువంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు.