అమ్మను మించిన దైవం లేదు అంటారు. అమ్మ ఏదైనా పిల్లల మంచి కోరే చేస్తోంది. కానీ ఆస్తి, అంతస్థులు కోసం తల్లిదండ్రులు ను చంపుతున్న కొందరు కసాయి తనయులు..కన్న తల్లిని చంపిన తనయుడు…..జన్మనిచ్చిన తల్లినే కాలరాశాడు ఓ కిరాతక కొడుకు. విచక్షణ రహితంగా కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. నందిగామ మండలం ఐతవరం గ్రామంలో మాగంటి ఉమామహేశ్వరి తన కొడుకు సురేష్‌తో ఉంటోంది. అయితే సురేష్ చెడు వ్యసనాలకు బానిస అయ్యాడు. ఈ విషయంపై తల్లి పలుమార్లు మందలించింది కూడా. అయినా వినిపించుకోలేదు కొడుకు సురేష్. ఈ నేపథ్యంతో తన ఆస్తి తనకు పంచాలంటూ తల్లితో గొడవకు దిగాడు కుమారుడు. కానీ ఆస్థి ఇస్తే మొత్తం సర్వనాశనం చేస్తాడని భావించిన తల్లి.. ఇచ్చేందుకు నిరాకరించింది.ఒత్తిడి ఎక్కువ కావడంతో చివరకు ఆమె కోర్టును ఆశ్రయించింది. ఈ వ్యవహారంపై విచారించిన న్యాయ స్థానం కొడుకుకు నోటీసులు జారీ చేసింది. తల్లి తన పరువు బజారుకేసిందని భావించిన సురేష్.. ఆమెపై పగ పెంచుకున్నాడు. ఆగ్రహంతో ఊగిపోయిన సురేష్.. తల్లిపై కత్తితో దాడి చేశాడు. కన్నతల్లి అని దయ లేకుండా పలుమార్లు కత్తితో పొడవడంతో ఆమె మరణించింది. ఆస్తి కోసం కన్న తల్లినే పొట్టనబెట్టుకున్నాడు కసాయి కొడుకు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు సురేష్ ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఆవేశం, ఆగ్రహంతో ఆమెను హత్య చేసి ఇప్పుడు కటకటాల పాలు అయ్యాడు. ఈ ఘటన చూస్తుంటే.. రానున్న తరంపై మరింత భయం, ఆందోళన నెలకొంటోంది.