కొట్టును గెలిపిస్తా : ఈలి నాని
తాడేపల్లిగూడెం,ఏప్రిల్ 19:
వైఎస్ఆర్సిపి అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేగా కొట్టు సత్యనారాయణ ను గెలిపిస్తానని మాజీ ఎమ్మెల్యే ఈలి నాని ప్రకటించారు. ఇటీవల సీఎం జగన్ సమక్షంలో ఈలి నాని వైఎస్సార్సీపీలో చేరిన సంగతి తెలిసిందే. శుక్రవారం సాయంత్రం స్థానికంగా ఈలి నాని ఇంటికి డిప్యూటీ సీఎం కొట్టు వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా ఈలి నాని మాట్లాడుతూ వైయస్ జగన్ ప్రజా పాలన నచ్చి రెండు నెలలుగా ఆలోచన చేసి వైయస్సార్సీపీలో చేరానన్నారు. జగన్ బాగా ఆలోచించి కొట్టు సత్యనారాయణకు టిక్కెట్ ఇవ్వడం జరిగింది అన్నారు. పార్టీ ఆదేశాల మేరకు కొట్టుతో ప్రచారంలో తాను పాల్గొంటానని ప్రకటించారు. జగన్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణ, ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాల విజయం కోసం డే అండ్ నైట్ కష్టపడి పని చేస్తానని ఈలి నాని స్పష్టం చేశారు. కొట్టు షెడ్యూలే తన షెడ్యూల్ అని, ఆయన వెంటే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని ఉద్ఘాటించారు. ఇవి ఆషామాషీ ఎన్నికలు కాదని ఆయన పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలతో పేద ప్రజానీకం మనో ధైర్యంతో గుండెల మీద చేయి వేసుకుని హాయిగా సుఖమైన జీవితం గడుపుతున్నారు అన్నారు. 2014 నుంచి 2019 వరకు రెండు సంవత్సరాలు కరోనాతో ప్రపంచమంతా గడగడలాడిన మన రాష్ట్రంలో మాత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అద్భుతమైన ప్రజాపాలన అందించారన్నారు. పేదవాడి ఆరోగ్యం కోసం ఆరోగ్యశ్రీ పథకాన్ని 25 లక్షల రూపాయలకు పెంచడం అద్భుతం అన్నారు. ఇవి రాష్ట్ర, దేశ భవిష్యత్తును నిర్దేశించే ఎన్నికలన్నారు. డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ తాను, నాని ఇద్దరం కలిసి సమన్వయంతో పని చేస్తామన్నారు. తాడేపల్లిగూడెం ఎంతో ప్రతిష్టాకర స్థానం ఖచ్చితంగా గెలవాలని సీఎం జగన్ తమకు దిశా నిర్దేశం చేశారన్నారు. తమ ఇద్దరి మంచి కలయికతో తాడేపల్లిగూడెంలో రాజకీయాన్ని మంచి మలుపు తిప్పుతామన్నారు. రౌడీయిజం, గూండాయిజం, సెటిల్మెంట్లకు అవకాశం లేని ప్రశాంతమైన వాతావరణం తాడేపల్లిగూడెంలో తీసుకొచ్చేందుకు నాని, తాను కలిసికట్టుగా సమన్వయంతో పని చేస్తామని ప్రకటించారు. పశ్చిమగోదావరి జిల్లాకు ముఖద్వారం గా ఉన్న తాడేపల్లిగూడెంలో అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్తామన్నారు. రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేగా తనతో పాటు నరసాపురం పార్లమెంట్ అభ్యర్థి గూడూరి ఉమాబాలను పెద్ద మెజారిటీతో గెలిపించాలని కొట్టు సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. మంత్రి కొట్టు తో పాటు నాని ఇంటికి వెళ్లిన వారిలో ఏపీ స్టేట్ ఆక్వా డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ వడ్డి రఘురాం నాయుడు, వైయస్సార్సీపి సీనియర్ నాయకులు గుండుమోగుల బలుసులరావు, కొలుకులూరి ధర్మరాజు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కర్రి భాస్కర్ రావు, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ కైగాల శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్, విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానం ట్రస్ట్ బోర్డు ప్రత్యేక ఆహ్వానితులు చెన్నా జనార్దన్ రావు, 23 వార్డ్ ఇంచార్జ్ పట్నాల గణపతి, కన్వీనర్ శ్రీనివాస్, పసల చంటి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా పుప్పాల శివాజీ, మల్లుల విజయ్ కుమార్, పిల్లా నరసింహారావు లను ఈలి నాని మంత్రి కొట్టుకు పరిచయం చేశారు.

previous post